రైతాంగం ఉద్యమాలకు సిద్ధం కావాలి…
సెప్టెంబర్ 8, 9న మంచిర్యాలలో ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలు.. పోస్టర్లు ఆవిష్కరణ….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దంపేట్/ : రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతాంగం ఐక్యమై మహత్తర ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు. అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయ ఆవరణలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర 9వ. మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, విత్తనాలు, ఎరువుల ధరలను ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని విమర్శించారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశ రైతాంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రైతులు, కూలీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రైతాంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి, రైతు–కూలీలను ఐక్యం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేసి, రైతు–కూలీలను పోరాటాల వైపు చైతన్యపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు, రైతు–కూలీలు తూల్ల గట్టయ్య, ఉప్పులేటి లింగయ్య, నల్లతీగల రమేష్, బండి శ్రావణ్, పొనగంటి క్రాంతికుమార్, బొడ్డుపల్లి రామస్వామి, పర్కాల శ్రీశైలం, తమ్మనవేని పెద్దమల్లయ్య, చిన్నమల్లయ్య, పల్లె శంకర్, మానిక గంగమల్లయ్య, మంతన శ్రీనివాస్, పి. సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST