సింగరేణిపై రాజకీయాలు కాదు.. అభివృద్ధే ముఖ్యం….
ఎమ్మెల్యే సమీక్షను తప్పుపట్టడం టీఆర్ఎస్ నాయకుల రాజకీయ దిగజారుడుతనం….
–కాంగ్రెస్ కార్పొరేటర్ల ఘాటు కౌంటర్….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, సింగరేణి కార్మికులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్ అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన సమీక్షను రాజకీయ కోణంలో చూడటం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఉదయం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలో సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు.
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్, ఎస్టీపీ నిర్మాణం, జీఎం కాలనీలో రాజీవ్‌గాంధీ విగ్రహం మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణ చర్యలు, సింగరేణి డీఎంఎఫ్‌టీ నిధులను రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడం, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడం వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారని పేర్కొన్నారు.
“అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? సింగరేణి నిధులు రామగుండం ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని కోరితే తప్పేంటి? ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులను ప్రశ్నిస్తే కూడా రాజకీయాలు చేస్తారా?” అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు.
గతంలో సింగరేణి విషయంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని, ప్రస్తుతం రామగుండం అభివృద్ధి, సింగరేణి కార్మికులు, ప్రజల ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
విమర్శల కోసం విమర్శలు కాదు.. రామగుండం అభివృద్ధి కోసం కార్యాచరణే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, సింగరేణి ద్వారా నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి, నిధులు, మౌలిక వసతులను సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST