యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఐకాన్ అవార్డుల లక్ష్యం….

Sakshitha news

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఐకాన్ అవార్డుల లక్ష్యం….

– వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డా. సురభి శ్రీధర్….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారి ప్రతిభకు గుర్తింపు కల్పించడమే ఐకాన్ అవార్డుల ప్రధాన ఉద్దేశమని వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ అన్నారు.

రాత్రి హైదరాబాద్ కింగ్‌కోటి, తిలక్‌ రోడ్, బొంగులకుంటలోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.

సంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు అవార్డులను అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్‌తో పాటు డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి, డాక్టర్ కుంట సురేష్, డాక్టర్ కోడెల మంజుల, డాక్టర్ పి.జి. సుదర్శన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త, లియో లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పంజాల శివకుమార్‌కు బిజినెస్ ఐకాన్ అవార్డును అందజేశారు.

చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని, లియో లైఫ్ మార్కెటింగ్ సంస్థను స్థాపించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు శివకుమార్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

అనంతరం అవార్డు గ్రహీత పంజాల శివకుమార్ మాట్లాడుతూ తన విజయ ప్రస్థానంలో ఈ ఐకాన్ అవార్డు తొలి అడుగుగా భావిస్తున్నానని అన్నారు. తనను ప్రోత్సహించి అవార్డుకు సహకరించిన వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్‌కు, అవార్డును అందజేసిన డాక్టర్ ఆకుల రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

శివకుమార్‌కు బిజినెస్ ఐకాన్ అవార్డు లభించడంపై లియో లైఫ్ సంస్థ సభ్యులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.