ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రండి.. ప్రజల మధ్యకు రండి

Sakshitha news

ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రండి.. ప్రజల మధ్యకు రండి….

1000 రోజులుగా ప్రజలకు దూరంగా కేసీఆర్‌.. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడాలి….

— ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, హైదరాబాద్‌/ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పటికైనా ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యకు రావాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు, రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు కేసీఆర్‌ ఎంతవరకు ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రజా సమస్యలు తలెత్తిన ప్రాంతాలను సందర్శించి బాధితులకు అండగా నిలిచారా అని నిలదీశారు.

“ప్రతిపక్ష హోదా అంటే పదవి, జీతం, ప్రభుత్వ సదుపాయాలు అనుభవించడం మాత్రమే కాదు.. ప్రజల కష్టాల్లో వారి మధ్య నిలబడి, వారి సమస్యలపై పోరాడే బాధ్యత కూడా” అని రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు తమ పార్టీ అధినేతను ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు తీసుకువచ్చి ప్రజల మధ్య నిలబెట్టాలని సూచించారు.

కేసీఆర్‌ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి జీతాల రూపంలో సుమారు రూ.1.24 కోట్లు తీసుకున్నారని రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జీతంతో పాటు ఆయనకు ప్రభుత్వం కల్పిస్తున్న సిబ్బంది, వాహనాలు, ఇతర సదుపాయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌, హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసం తదితర ప్రాంతాల్లో 57 మందికి పైగా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా నాలుగు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, ఫాలోయింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌, పికప్‌ వాహనాలు తదితర ప్రభుత్వ సదుపాయాలపై గత 32 నెలల్లో సుమారు రూ.21 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని రాజ్‌ఠాకూర్‌ సూచించారు. “ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రతిపక్షం.. ప్రజలకు దూరంగా ఉండటం సరికాదు” అని ఆయన అన్నారు.