పేద కుటుంబాలకు యాదవ యువసేన అండ..
-15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు
-నిరుపేదలకు ఆర్థిక సహకారం అందిస్తున్న యువతకు గ్రామస్తుల అభినందనలు.
సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కేతేపల్లి గ్రామానికి చెందిన యాదవ యువసేన యువత అభినందనీయమైన సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. కేతేపల్లి గ్రామానికి చెందిన జటంగి వీరయ్య (40) తండ్రి బిక్షమయ్య. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నిలిచిన యాదవ యువసేన సభ్యులు, వీరయ్య దశదిన కార్యక్రమాల్లో భాగంగా యాదవ యువసేన తరఫున రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా రవి యాదవ్ తన వంతుగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యాదవ యువసేన అధ్యక్షుడు ఉప్పల వెంకన్న మాట్లాడుతూ…. 2010 సంవత్సరం నుంచి యాదవ యువకుల సహకారంతో నిరుపేద కుటుంబాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నామని తెలిపారు.
గత 15 సంవత్సరాలుగా గ్రామ యువత సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మనకు చేతనైనంత సహాయం చేయడం ద్వారా వారికి కొంత ధైర్యం కల్పించవచ్చని అన్నారు. యాదవ యువసేన ఉపాధ్యక్షుడు దుబాని లక్ష్మణ్ మాట్లాడుతూ…. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి యువకుడు తన బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. సేవ చేయడానికి సంపద కంటే మంచి మనసు ముఖ్యమని, యువతలో సేవాభావం పెంపొందితే సమాజంలో మరింత మంచి మార్పు సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులోనూ నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పేద కుటుంబానికి కష్టకాలంలో యువత అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని గ్రామ పెద్దలు, గ్రామస్తులు పేర్కొన్నారు. యువత కేవలం వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఒక కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ‘మేమున్నాం’ అంటూ చేయూతనిచ్చే సేవా దృక్పథం మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ యువసేన కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
