తెలుగువారి సాహసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు

Sakshitha news

తెలుగువారి సాహసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు

సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు

ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, సుప్రసిద్ధ జాతీయ ప్రజానాయకుడు, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణకర్త, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 155వ జయంతి సందర్భంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజివద్ద వున్న టంగుటూరి ప్రకాశం విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, విజయవాడ జలవనరుల శాఖ ఎస్ ఈ జె. గుణకారరావు, జలవనరుల శాఖ కె.సి. డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రావెల్ల రవికిరణ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని వేరుచేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యారని, స్వాతంత్య్రానికి ముందు సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు తమిళులు గజగజ వణికిపోతుంటే లక్షలాదిమందికి ధైర్యం చెప్పి సైమన్ గోబ్యాక్ అని గర్జించారని, అప్పుడే పోలీసులు ప్రకాశం గుండెలపైకి తుపాకి పెట్టి కాల్చటానికి ప్రయత్నించగా… తూటాకు తన గుండెను చూపించిన ధీశాలిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా 13 నెలలు అతితక్కువ సమయం పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో 1954 ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజి నిర్మాణానికి ప్రకాశం పంతులు శంఖుస్థాపన చేశారని, 14 నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టి రికార్డు స్థాపించారన్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల్లో ఏటా మాగాణి సాగు చేసేందుకు ప్రకాశం బ్యారేజ్ వరదాయినిగా మారిందన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో 2014-19 మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి వృధాగా సముద్రంలోనికి పోతున్న జలాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజి, దిగువన చోడవరం దగ్గర 5 టి.ఎం.సి.లతో ఒక బ్యారేజ్ ప్రతిపాదన చేశారని, వై.సి.పి. ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసిందని, మరలా ప్రస్తుత ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో ఇవి పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లాగే ప్రకాశం పంతులుగారు ఇచ్చిన స్ఫూర్తితో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టిసీమ ద్వారా 2015 లో కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి 2015-2019 మధ్యన కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు 358 టి.ఎం.సి.ల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజి ద్వారా రైతులకు అందిస్తే అప్పట్లో రైతులకు 45వేల కోట్ల రూపాయలు ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జి.డి.పి.లో కృష్ణాజిల్లా 2వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితి లో కృష్ణా డెల్టా కు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు రావటం వల్ల సాగునీరు త్రాగునీరు కు జీవం పోసిందని అన్నారు. ప్రకాశం పంతులుగారు ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రంలోని జలవనరుల శాఖలో పనిచేసే యువ ఇంజనీర్లు అందరూ క్రమశిక్షణ, పట్టుదల, నీతి, నిజాయితీతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కటారి కోటేశ్వరరావు, డి.ఇ.ఐ. అజయ్ బాబు, ఏ.ఈ.ఈ యూ. రాజేష్, జలవనరుల శాఖ సిబ్బంది సత్తార్, భాస్కర్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top