నైపుణ్యాలతోనే మెరుగైన కెరీర్‌కు బాట…
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, సుల్తానాబాద్/ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు భవిష్యత్ ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
సుల్తానాబాద్ మండలంలోని ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్.ఈ.ఐ.ఎస్ బాలికల డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలోని చాంబర్ ఆఫ్ డ్రీమ్స్‌ను ప్రారంభించి, డార్మిటరీ, వంటగది, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకడమిక్ విద్యతో పాటు విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాలు ఎంతో కీలకమని తెలిపారు.
కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కెరీర్ గైడెన్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య, వివిధ కోర్సులు, పీజీ కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ ద్వారా టాస్క్ సహకారంతో విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.
టాస్క్ రీజినల్ సెంటర్,వి -హాబ్ ద్వారా అందిస్తున్న వివిధ కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీఓ మణిదీప్తి, కళాశాల ప్రిన్సిపాల్ వనజ, సంబంధిత అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
