ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి…..
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…..
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
నిరుపేద వికలాంగురాలికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు
పెద్దపల్లి పట్టణంలోని ఉదయ్‌నగర్‌కు చెందిన కే. నర్సమ్మ తనకు సొంత ఇల్లు, భూమి లేదని, తాను నిరుపేద వికలాంగురాలినని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన కలెక్టర్ పీడీ హౌసింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేస్తూ పెద్దపల్లిలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి, అర్హత మేరకు కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు
సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కోండ్ర అశోక్ తాను నాలుగున్నర సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నానని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భార్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కోరారు. దీనిపై వారధి సొసైటీకి సూచనలు చేస్తూ, అవకాశాన్ని బట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వృద్ధాప్య పింఛన్‌కు చర్యలు
పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన పి. శంకర్ వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచనలు చేస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
భూ సమస్య పరిష్కరించాలని వినతి
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పి. కొమురయ్య సాదా బైనామా కోసం దరఖాస్తు చేసుకున్నానని, అందులో కొన్ని వివరాలు తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరిచేసి తన భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై సంబంధిత తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసి, నిబంధనల మేరకు సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
