కులాంతర వివాహాల ప్రోత్సాహక నిధులు వెంటనే విడుదల చేయాలి….
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న జిల్లాకే నిధులు రావా….?
అర్హులను ఏళ్ల తరబడి వేచి చూడించడం సరికాదు…
— మద్దెల దినేష్…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ఆగస్టు-17: కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, కులాంతర వివాహాలు చేసుకున్న దళిత జంటలకు సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించడంలో పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతోందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయని, ఈ పథకం కింద అర్హులైన జంటలకు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించాల్సి ఉందన్నారు. వధువు లేదా వరుడు ఇద్దరిలో ఒకరు ఎస్సీకి చెందిన వారై ఉండటంతో పాటు, వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13,419 కులాంతర వివాహాలకు సుమారు రూ.238.17 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయని దినేష్ పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 1,259 కులాంతర వివాహాలకు రూ.31.48 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం ఉందన్నారు.
అయితే పెద్దపల్లి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు కులాంతర వివాహాలు చేసుకుని ఏళ్లుగా ప్రోత్సాహక నిధుల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవంటూ అధికారులు నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం సరికాదన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ పెద్దపల్లి జిల్లాకు నిధులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
కులాంతర వివాహాల ప్రోత్సాహక పథకంపై జిల్లా స్థాయిలో సమీక్షలు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా, క్షేత్రస్థాయిలో అర్హులకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కులాంతర వివాహాల ప్రోత్సాహకం కేవలం ఆర్థిక సహాయం కాదని, కుల వివక్షను నిర్మూలించే సామాజిక సంకల్పంలో భాగమని దినేష్ అన్నారు. ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం అందిస్తున్న రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
