వందేమాతరం గీతం అవమానంపై బీజేపీ నిరసన
బాధ్యుల అరెస్టుకు బీజేవైఎం డిమాండ్
సాక్షిత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
వందేమాతరం గీతాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుణగంటి పృథ్వీ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేవైఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుణగంటి పృథ్వీ మాట్లాడుతూ, ఆగస్టు 15న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు.
ఈ ఘటన ద్వారా దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపడంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జాతీయ గీతాలు, జాతీయ చిహ్నాలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. వందేమాతరం గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదని, దేశభక్తి, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగరాజు రుక్మారావు, జిల్లా ఉపాధ్యక్షులు బండపల్లి పాండురంగ చారి, గిరిజన మోర్చా జనరల్ సెక్రటరీ ధారావత్ రవి నాయక్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొజ్జ పరశురాం, జిల్లా కోశాధికారి రవి వర్మారెడ్డి, సీనియర్ నాయకుడు కోడి లింగయ్య యాదవ్, శ్రవణ్ ఉప్పల, బీజేవైఎం నాయకులు బోర రమేష్ యాదవ్, భరత్, కళ్యాణ్, గణేష్, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
