బహదూర్‌పల్లి: ఓటరు జాబితా సవరణ, ఓటర్ల వివరాల మ్యాపింగ్ తదితర కార్యక్రమాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అందించిన సేవలు అభినందనీయమని కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బహదూర్‌పల్లి మేకల వెంకటేష్ గార్డెన్స్‌లో నిర్వహించిన దుండిగల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎల్ఏలను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు దాదాపు రెండు నెలల పాటు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓటు మ్యాప్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేసిన బీఎల్ఏల కృషి అభినందనీయమన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త, నాయకుడు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్యకర్తలు తమ దృష్టికి తీసుకువస్తే, వాటిని మంత్రులు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కూన శ్రీశైలం గౌడ్ గారు హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, భూపతి రెడ్డి, బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డితో పాటు స్థానిక డివిజన్ అధ్యక్షులు, బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
