అన్ని సమస్యలు విన్నా అతి త్వరలోనే పరిష్కరిస్తా.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని నమోదు చేసుకున్నామని, అతి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చాలా మంది ప్రజలు సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీల వంటి మౌలిక వసతుల పనులు చేపట్టాలని కోరారని, ఇవన్నీ నెరవేర్చేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రీవెన్స్ అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన ‘సర్’ (ఎస్ ఆర్ ఐ) కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరాన్ని స్థానిక నాయకులకు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కోవూరు నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియ పురోగతిని పరిశీలిస్తే.. కోవూరు మండలంలో 75 శాతం, కొడవలూరులో 72.39 శాతం, ఇందుకూరుపేటలో 72.2 శాతం, బుచ్చి రూరల్లో 71.2 శాతం, విడవలూరులో 67.54 శాతం పూర్తి కాగా, బుచ్చి టౌన్లో కేవలం 63.4 శాతం మాత్రమే పూర్తయిందని తెలిపారు. బుచ్చి టౌన్ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, ఏ వార్డుల్లో అయితే ఈ ప్రక్రియ వెనకబడి ఉందో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో మొత్తం 2,69,146 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,66,838 ఎనుమరేషన్ ఫామ్లను పంపిణీ చేసి 99.14 శాతం పూర్తి చేయడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అయితే ఇందులో 1,97,000 వేల ఫామ్లు మాత్రమే డిజిటలైజేషన్ (72 శాతం) అయ్యాయని, మిగతా పనిని కూడా నాయకులు వేగంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నందున, మ్యాపింగ్, లింకేజ్ కాకుండా మిగలిపోయిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
