సీఎం చంద్రబాబు నాయుడుతో వేమిరెడ్డి దంపతుల భేటీ
కోవూరు నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి
కోవూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు మరియు అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. అలాగే జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.ముదివర్తి – ముదివర్తి పాలెం వరకు కాజ్వే నిర్మాణ పనులను వేగవంతానికి చర్యలు తీసుకోవాలని, గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో ఉప్పుటేరు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బుచ్చిరెడ్డి పాళెం ఫైర్ స్టేషన్‌కు కావాల్సిన అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసిన వారిలో నెల్లూరు నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

