ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం విజయవంతం
ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే 82 శాతం అధికంగా ఆదాయం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేయబడిన 24 వాహనాల వేలం బుధవారం నిర్వహించబడింది. ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ స్టీవెన్ సన్ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ చేపట్టారు. ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కనీస ధర రూ. 4,06,980 కాగా, పోటీ పద్ధతిలో నిర్వహించిన వేలంలో వాహనాలు మొత్తం రూ. 7,39,860లకు అమ్ముడయ్యాయి. దీంతో అంచనా ధరతో పోల్చితే సుమారు 82 శాతం అధికంగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
స్థానిక వ్యాపారులు, ఆసక్తిగల కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీగా పాల్గొనడంతో ధరలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా చట్టపరమైన చర్యలు కఠినంగా కొనసాగుతాయని, కేసుల్లో స్వాధీనం చేసిన ఆస్తులను నియమ నిబంధనల ప్రకారం వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరుతుందని తెలిపారు. వేలం విజయవంతంగా పూర్తికావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ప్రోహిబిషన్ సీఐ మల్లేష్ యాదవ్ తో పాటు వారి సిబ్బంది, కొనుగోలు దారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY