ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి.. ప్రధాని మోదీకి రోహిత్ పవార్ లేఖ!
విమానం ప్రమాదంలో అజిత్ పవార్ మృతిపై దర్యాప్తు
దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే మంత్రి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్
పైలట్ గతంలో మూడేళ్ల పాటు సస్పెన్షన్ కు గురయ్యారని వెల్లడి
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమాన ప్రమాదంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అప్పటి వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
లేఖలోని ప్రధానాంశాలు..
జనవరి 28న బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన విమానం ‘వీఎస్ఆర్ వెంచర్స్’ సంస్థకు చెందినదని, ఈ సంస్థతో విమానయాన మంత్రికి చెందిన రాజకీయ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరగాలంటే మంత్రి పదవిలో ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
కుట్ర కోణంపై అనుమానాలు..
ఈ ప్రమాదం వెనుక రాజకీయ లేదా వ్యాపార పరమైన కుట్ర ఉండవచ్చని రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ప్రమాదానికి కారణమైన కంపెనీని కొందరు శక్తివంతులు కాపాడుతున్నారు. ఇందులో డీజీసీఏ అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ, అమిత్ షా స్వయంగా దృష్టి సారించాలి’’ అని ఆయన కోరారు.
పైలట్ ట్రాక్ రికార్డ్‌పై ప్రశ్నలు..
ప్రమాద సమయంలో విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ గతంలో మద్యం సేవించినందుకు మూడేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారని, అటువంటి వ్యక్తికి విమాన బాధ్యతలు ఎలా అప్పగించారని రోహిత్ ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన విద్రోహ చర్య కావచ్చని ఆయన ఆరోపించారు.
అంతర్జాతీయ సంస్థలతో విచారణ..
ఈ కేసులో దేశంలోని ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయం ఉన్నందున, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో స్వతంత్ర విచారణ జరిపించాలని రోహిత్ పవార్ ప్రధానిని కోరారు. ‘‘అజిత్ దాదా దేశానికి చేసిన సేవలను మీరు ఎప్పుడూ గౌరవిస్తారు. ఆ గౌరవార్థం ఈ కేసులో పారదర్శకత కోసం రామ్మోహన్ నాయుడును రాజీనామా కోరండి’’ అని లేఖలో విన్నవించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
