శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవంపై సమన్వయ సమావేశం
సాక్షిత ప్రతినిధి – శ్రీకాళహస్తి / తిరుపతి: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, భద్రత, ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, దేవస్థానం ఈఓ బాపిరెడ్డి పోలీస్ శాఖ… దేవస్థానం అధికారులతో కలిసి శ్రీకాళహస్తిలో విస్తృత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్ నిర్వహణను సక్రమంగా అమలు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించారు.
ఆలయం పరిసర ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి సరైన ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ బస్సులు… ఇతర వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, రాంగ్ పార్కింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ, దేవస్థానం అధికారులతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రవిమనోహర ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు, సంబంధిత డీఎస్పీలు, సీఐలు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY