మకర వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
మకర వాహన ప్రాశస్థ్యం
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కె.పి.చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు దామోదర్, రవికుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY