రైతులను ఆదుకుంటాం .. అండగా ఉంటాం

Sakshitha news

రైతులను ఆదుకుంటాం .. అండగా ఉంటాం

  • అర్నబ్ తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది
  • దెబ్బతిన్న పంటలకు, కూలిపోయిన ఇళ్లకు నష్ట పరిహారం అందిస్తాం
  • వీరవాసరంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే అంజిబాబు
  • వరి కంకులను, పడిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి

భీమవరం వీరవాసరం ;
అర్నబ్ తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, చేతికి వచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను, ఇళ్లను ఎమ్మెల్యే అంజిబాబు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కూటమి నాయకులు పరిశీలించి రైతులను పరామర్శించారు. గురువారం వీరవాసరం, బాలేపల్లి, మెంటేపూడి, బొబ్బనపల్లి, చింతలకోటి గరువు, వీరవల్లిపాలెం, రాయకుదురు, అండలూరు గ్రామంలో ఎమ్మెల్యే అంజిబాబు పర్యటించారు. వ్యవసాయ భూముల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భారీ వర్షాల కారణంగా వరి పంటకు జరిగిన నష్టాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించి, పంట పరిస్థితిని రైతుల నుంచి తెలుసుకున్నారు. నీటిలో మునిగి దెబ్బతిన్న వరి కంకులను స్వయంగా చేతిలోకి తీసుకుని పరిశీలించారు. పంటలు దెబ్బతినడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. రహదారులపై విరిగిపడిన చెట్ల తొలగింపును విద్యుత్ పనులను పరిశీలించారు. వీరవల్లిపాలెంలో రెండు గేదెలు మృతి చెందడంతో వారిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలేపల్లి, చింతలకోటి గరువు, వీరవల్లి పాలెంలో కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు రైతులు పాల్గొన్నారు.