ఏపీలో మర్డర్..!

Sakshitha news

ఆమెకు 41.. అతనికి 20

తెలంగాణలో కత్తి కొనుగోలు

ఏపీలో మర్డర్..!!

హత్య చేసి – పెట్రోల్ పోసి

వివాహానికి అడ్డొస్తుందని ప్రియురాలిని హత్య చేసి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసును ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉంగుటూరు మండలం రాపులపర్రుకి చెందిన గండికోట అజయ్‌కుమార్‌ (20)ను అరెస్టు చేశారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. రావులపర్రుకి చెందిన సంధ్యారాణి (41) తన భర్తతో కలిసి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన డ్రైవర్‌గా పనిచేస్తున్న గండికోట అజయ్‌ పరిచయమయ్యాడు. ఇది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల అజయ్‌కి తన మరదలితో వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఈ నేపథ్యంలో సంధ్యారాణితో సంబంధాన్ని కొనసాగించడానికి అజయ్ నిరాకరించాడు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తామిద్దరం కలిసి ఉన్నప్పటి ఫొటోలను సంధ్యారాణి బయటపెట్టవచ్చని భావించిన అజయ్‌.. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇటీవల హైదరాబాద్ వెళ్లిన అజయ్ అక్కడ కత్తి కొనుగోలు చేసి స్వగ్రామం వచ్చాడు. తాడేపల్లిగూడెంలో కారును అద్దెకు తీసుకుని.. ఈనెల 23న సంధ్యారాణిని కారులో ఎక్కించుకుని నాచుగుంట రెవెన్యూలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడపై కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సంధ్యారాణి మృతదేహంపై ఉన్న బంగారు ఆభరణాలు, ఆమె ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సంధ్యారాణి కనిపించట్లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి రాజేశ్‌ ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన మహిళను అదృశ్యమైన సంధ్యారాణిగా గుర్తించారు. నిడమర్రు సీఐ రజనీ కుమార్ పర్యవేక్షణలో చేబ్రోలు ఎస్సై, గణపవరం ఎస్సై మణికుమార్‌తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలు, హత్య చేయడానికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.