ఎస్‌ఐపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకే.. గుంటూరు ఎస్పీకి మాజీ మంత్రి విడదల రజిని ఫిర్యాదు
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, కిందకు తోసివేసిన ఎస్‌ఐ ప్రియాంకపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె గుంటూరు జిల్లా ఎస్పీ జగదీశ్‌కు కంప్లైంట్ చేశారు.
ఎస్‌ఐపై సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటానికి దిగుతామని, కోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా విడదల రజిని హెచ్చరించారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం రజిని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కనుమరుగైందని, కేవలం ‘రెడ్ బుక్’ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని ఆరోపించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కిడ్నాప్‌లకు పాల్పడుతూ బలవంతంగా నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై ఇలాంటి కక్షసాధింపు చర్యలు సరికాదని, అధికార పార్టీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
విచారణ చేయాలని SEC ఆదేశం…
విడదల రజిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఇంటి ఆవరణలో ఎస్‌ఐ ప్రియాంకకు, రజినికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దాంతో విడదల రజిని అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై SEC సీరియస్ అయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు అన్ని రకాల పోలీసుల విధుల నుంచి తప్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందించాలని కూడా తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ విడదల రజిని ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం ఉత్కంఠగా మారింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST