అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
పాలేరు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి
పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
స్థానిక శ్రీశ్రీ సర్కిల్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఇంజనీరింగ్, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధుల మంజూరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడూతూ, అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని తెలిపారు. భూసేకరణ, ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్ట్ చేసేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.
అభివృద్ధి పనుల్లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా, భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు ఇచ్చే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో పనుల బిల్లుల చెల్లింపుకు ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు ప్రతి నెల 20 కోట్ల నుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున నీరు, విద్యుత్‌లను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు రెండో పంట వేయకూడదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సిఈ వాసంతి, ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్ రెడ్డి, మెడికల్ ఈ ఈ ఉమామహేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఈ లు, డిఈ లు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST