కోదాడ పట్టణంలో ప్రశాంత వాతావరణం లో గంగ కు చేరిన గణ నాధుడు….
సాక్షిత సూర్యాపేట జిల్లా/ కోదాడ
గణపతి బొప్పా మోరియా నినాదాలతో దద్దరిల్లిన కోదాడ…
తీన్మార్ డప్పుల దరువులకు యువత స్టెప్పులే.. స్టెప్పులు
కోలాటాలతో , డ్యాన్స్ లతో మహిళల సందడి….
రంగులు చల్లుకుంటూ యువత కేరింతలు….
బాణాసంచా మోతలతో హోరెత్తిన ప్రధాన వీధులు…
భక్తులకు మంచినీరు అందించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం సోదరులు…..
భారీ ఊరేగింపులతో పెద్ద చెరువుకు చేరిన గణనాథులు..
ప్రశాంతంగా నిమజ్జనం… పోలీసుల గట్టి బందోబస్తు…
కోదాడ పట్టణం బుధవారం గణేష్ నిమజ్జనం లో భాగంగా జరిగిన ఊరే గుంపులో గణపతి బొప్పా మోరియా నినాదాలతో కోదాడ పట్టణం దద్దరిల్లింది. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గణేష్ నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో వివిధ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపులు నిర్వహించగా, గణనాథుల దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, డీజే సంగీతాల నడుమ ఊరేగింపులు సాగాయి.
తీన్మార్ డప్పుల దరువులకు యువత ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ సందడి చేయగా, మహిళలు కోలాటాలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు భక్తులు ప్రత్యేక దుస్తులు ధరించి గణనాథుడి ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలుచోట్ల బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకోవడంతో పట్టణ ప్రధాన వీధులు సందడిగా మారాయి. మేళగాళ్లు, డప్పు బృందాలు, మైక్ సౌండ్ సిస్టమ్‌లకు భారీగా డిమాండ్ కనిపించింది. వివిధ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిమజ్జనానికి తరలివెళ్లే భక్తులకు మంచినీరు, ప్రసాదం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోదాడకు చెందిన ముస్లిం సోదరులు నిమజ్జనానికి తరలివెళ్తున్న హిందూ భక్తులకు మంచినీరు అందించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. పరస్పర సహకారం, సోదరభావంతో నిమజ్జన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పలుచోట్ల పోటాపోటీగా పులి హోరా ప్రదర్శనలు నిర్వహించడంతో యువత, భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. గణపతి లడ్డూ ప్రసాదాల పంపిణీ కూడా విస్తృతంగా చేపట్టారు. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి గణనాథుడి ఆశీస్సులు పొందారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణపయ్యలను కోదాడ పెద్దచెరువు వద్ద నిమజ్జనం కోసం తరలించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ విగ్రహాల కోసం కోదాడ మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో పెద్దచెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలంకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన ప్రదేశంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల నాయకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు భోజన వసతి కల్పించారు. గణనాథుల ఊరేగింపులు, భక్తుల జయజయధ్వానాలు, డప్పుల దరువులు, మేళతాళాల మధ్య సాగి చివరకు పెద్దచెరువు నిమజ్జన ఘాట్‌కు చేరుకున్నాయి. భక్తులు గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి, కన్నుల పండువగా వీడ్కోలు పలికారు. అనంతరం గణనాథులను భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తవడంతో నిర్వాహకులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తుల ఐక్యత, పరస్పర సహకారం, మత సామరస్యం, శాంతియుత వాతావరణంలో జరిగిన నిమజ్జన వేడుకలు కోదాడలో పండుగ వైభవాన్ని చాటిచెప్పాయి.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST