నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోంది
- ఐదేళ్లు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టూ భర్తీ చేయని వైసీపీకి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ పుట్టిందా?
- 160 ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక తప్పుడు కథనాలతో అడ్డుకునే కుట్ర
- అభ్యర్థులు కోరిన విధానాన్నే అమలు చేస్తే అక్రమమా?
- కనీసం డైరెక్టర్ ఎవరో తెలుసుకోకుండా కథనం రాస్తారా? ఇదేనా ‘సాక్షి’ జర్నలిజం?
- ఉద్యోగాలు ఇవ్వడం మా విధానం.. ఉద్యోగాలకు అడ్డుపడటం వైసీపీ విధానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబర్ 15: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తుంటే చూసి ఓర్వలేక, వారి అవకాశాలపై కూడా విషం చిమ్మే స్థాయికి వైసీపీ, దాని కరపత్రం ‘సాక్షి’ దిగజారాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను రోడ్లపై తిప్పిన వారు, కూటమి ప్రభుత్వం 160 పోస్టుల భర్తీకి ముందుకొస్తే ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగం ఇవ్వరు… ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు… నియామకాలు చేపడితే అనుమానాలు సృష్టిస్తారు… ఇదే వైసీపీ, సాక్షి మార్కు నిరుద్యోగ వ్యతిరేక రాజకీయం అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఐదేళ్లు ఏం చేశారు? ఒక్క పోస్టయినా భర్తీ చేశారా?
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుతం సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలోనే 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు మేం ఉద్యోగాలు ఇస్తుంటే ‘మరో రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు’ అంటూ విషపు రాతలు రాస్తున్నారు. మీ బాధ ఉద్యోగాలు రావడం గురించా? లేక ఆ ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయన్నదా? నిరుద్యోగులకు వైసీపీ, సాక్షి సమాధానం చెప్పాలి అని మంత్రి ప్రశ్నించారు.
చరిత్ర తెలుసుకోకుండా రాతలు రాస్తే అది వార్త కాదు.. విషప్రచారం
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వెటర్నరీ డాక్టర్ల నియామకాలను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ద్వారానే నిర్వహిస్తున్న విషయాన్ని ‘సాక్షి’ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని మంత్రి తెలిపారు. 28.10.2016న జారీ చేసిన G.O.Ms.No.52 ప్రకారం మొత్తం 100 మార్కులతో మెరిట్ నిర్ణయించే స్పష్టమైన విధానం ఉందన్నారు. BVSc మార్కులకు 60 మార్కులు, MVSc అర్హతకు 10 మార్కులు, ప్రభుత్వ/కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు లేదా స్థానిక సంస్థల్లో కాంట్రాక్ట్ సేవకు 10 మార్కులు, గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి సీనియారిటీకి సంవత్సరానికి నాలుగు మార్కుల చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం అమల్లో ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల నియామకాలు కూడా ఇదే తరహా వెయిటేజీ విధానంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
అభ్యర్థులే కోరారు.. ప్రభుత్వం మానవీయంగా స్పందించింది
జాబ్ క్యాలెండర్‌లో భాగంగా G.O.Ms.No.21 ద్వారా ఈ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించిందని మంత్రి వివరించారు. అయితే గత ఎనిమిదేళ్లుగా నియామకాలు జరగలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా పరీక్షా విధానం తీసుకొస్తే ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు నష్టపోతారని వెటర్నరీ నిరుద్యోగుల సంఘమే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. కనీసం ఈ ఒక్కసారికి పాత వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని వారు కోరారని తెలిపారు. నిరుద్యోగుల విజ్ఞప్తిని వినడం తప్పా? ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయడం నేరమా? వారు కోరిన విధానాన్ని పరిశీలించి అవకాశం కల్పిస్తే అందులో కూడా కుట్ర కనిపిస్తోందంటే ‘సాక్షి’ కళ్లకు రాజకీయ కళ్లద్దాలు ఎంత బలంగా అతుక్కుపోయాయో అర్థమవుతోంది అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇది అత్యంత సాంకేతిక రంగం కావడం, వైద్య ఆరోగ్య శాఖలోనూ వెయిటేజీ విధానం అమలులో ఉండటం, అభ్యర్థుల విజ్ఞప్తిలో న్యాయం ఉండటంతో ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి G.O.Ms.No.52 ప్రకారం పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు నిర్వహించాలని APPSCను కోరిందని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుత పని ఒత్తిడి, పరీక్ష లేకుండా వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టేందుకు అవసరమైన సమయం లేకపోవడంతో ఈ ప్రక్రియను నిర్వహించలేమని APPSC తెలియజేసిందన్నారు. అందుకే G.O.Ms.No.22 ద్వారా ఈ ఒక్కసారికి మాత్రమే పాత విధానంలో పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఇక్కడ దాచింది ఏముంది? రహస్యం ఏముంది? ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే ‘ఈ ఒక్కసారికి మాత్రమే’ అని స్పష్టంగా ఉంది. భవిష్యత్ నియామకాలను APPSC ద్వారా పరీక్షా విధానంలో నిర్వహిస్తామని కూడా స్పష్టంగా పేర్కొన్నాం. అయినా అనుమానాలంటూ పొగ సృష్టించి అందులో రాజకీయ చలి కాచుకోవడం సాక్షికే చెల్లింది అని మంత్రి ఎద్దేవా చేశారు.
డైరెక్టర్ ఎవరో కూడా తెలియదా? ఇదేనా మీ విశ్వసనీయత?
‘సాక్షి’ కథనంలో ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా దామోదర్ నాయుడు ఉన్నట్లు పేర్కొనడాన్ని మంత్రి తప్పుబట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్‌గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఒక శాఖకు ప్రస్తుతం డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడానికి కూడా కనీస ప్రయత్నం చేయకుండా కథనం రాసి, ప్రభుత్వంపై బురద చల్లితే దాన్ని జర్నలిజం అంటారా? హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద. వాస్తవాలు సున్నా.. విషప్రచారం వంద. ఇదే ఇప్పుడు సాక్షి పరిస్థితి అని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు చివరిసారిగా పాత విధానంలో అవకాశం కల్పిస్తున్నాం. తర్వాత నుంచి APPSC పరీక్షా విధానమే ఉంటుందని ముందుగానే స్పష్టం చేస్తున్నాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? అనుమానం ఎక్కడుంది? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుడి చేతిలో అపాయింట్‌మెంట్ ఆర్డర్ చూడాలని మేం కోరుకుంటున్నాం. ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఆపి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ కోరుకుంటోంది. ఇదే మాకూ వాళ్లకూ ఉన్న తేడా అని మంత్రి అన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే తన అనుకూల మీడియాతో అనుమానాలు సృష్టించి నియామక ప్రక్రియను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. యువత భవిష్యత్తుపై రాజకీయ విషం చిమ్మడం మానుకోండి. మీ రాజకీయ కక్షలకు నిరుద్యోగులను బలి చేయొద్దు. వాస్తవాలను వక్రీకరించి ఎన్ని కథనాలు రాసినా నిజాన్ని దాచలేరు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అవకాశాలు కల్పిస్తుంది. వైసీపీ–సాక్షి ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST