భారతీయ జనతా పార్టీ దుండిగల్ సర్కిల్ ఆధ్వర్యంలో గండిమైసమ్మ దుండిగల్ మండలం,డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Sakshitha news

భారతీయ జనతా పార్టీ దుండిగల్ సర్కిల్ ఆధ్వర్యంలో గండిమైసమ్మ దుండిగల్ మండలం,డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

విషయం:

సెప్టెంబర్ 17ను అధికారికంగా “తెలంగాణ విమోచన దినోత్సవం”గా నిర్వహించడం మరియు తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి.,

1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని మహోన్నతమైన రోజు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భానికి ఈ రోజు ప్రతీక.

ఈ విమోచన కోసం అనేకమంది రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజలు పోరాడి ప్రాణత్యాగాలు చేశారు. భారత ఐక్యత కోసం ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చూపిన రాజకీయ సంకల్పం, భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో ఈ చారిత్రక పరిణామంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ చరిత్రను భావితరాలకు అందించడం కేవలం రాజకీయ అంశం కాదు — తెలంగాణ చరిత్రను పరిరక్షించడం, అమరవీరుల త్యాగాన్ని గౌరవించడం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున “తెలంగాణ సప్త సంకల్పాలు” మీ దృష్టికి తీసుకువస్తున్నాము.

తెలంగాణ సప్త సంకల్పాలు

  1. సెప్టెంబర్ 17 – అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవం
    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలి.
  2. సర్దార్ వల్లభభాయ్ పటేల్ – “స్టాట్యూ ఆఫ్ లిబరేషన్ – తెలంగాణ”
    హైదరాబాద్ విమోచనలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు హైదరాబాద్‌లో భారీ “స్టాట్యూ ఆఫ్ లిబరేషన్ – తెలంగాణ” నిర్మించాలి. అది తెలంగాణ విముక్తికి, భారత ఐక్యతకు శాశ్వత ప్రతీకగా నిలవాలి.
  3. “హైదరాబాద్–తెలంగాణ విమోచన మ్యూజియం” ఏర్పాటు
    హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో “హైదరాబాద్–తెలంగాణ విమోచన మ్యూజియం” ఏర్పాటు చేయాలి. నిజాం పాలన, రజాకార్ల దురాగతాలు, ప్రజాపోరాటాలు, ఆపరేషన్ పోలో, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను పరిరక్షించాలి.
  4. ప్రతి జిల్లా కేంద్రంలో “తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం”
    ప్రతి జిల్లా కేంద్రంలో “తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం” ఏర్పాటు చేసి, ఆయా జిల్లాల్లో జరిగిన పోరాటాలు, స్థానిక వీరులు, అమరవీరుల చరిత్రను నమోదు చేసి భావితరాలకు అందించాలి.
  5. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ విమోచన చరిత్ర – అజ్ఞాత వీరుల అధికారిక జాబితా
    నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ, ప్రజాపోరాటం, ఆపరేషన్ పోలో చరిత్రను పాఠశాల–కళాశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న తెలిసిన–తెలియని వీరులు, అమరవీరుల అధికారిక జాబితా రూపొందించాలి.
  6. రజాకార్ల దురాగతాలకు గురైన గ్రామాల్లో విమోచన స్మారక స్తూపాలు
    రజాకార్ల దురాగతాలకు గురైన, ప్రజా ప్రతిఘటనలు జరిగిన బైరాన్‌పల్లి, పరకాల వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అలాంటి గ్రామాలను గుర్తించి, అక్కడ తెలంగాణ విమోచన స్మారక స్తూపాలు నిర్మించాలి.
  7. “తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్” అభివృద్ధి
    తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన చారిత్రక గ్రామాలు, కోటలు, పోరాట కేంద్రాలు, అమరవీరుల స్థలాలను అనుసంధానిస్తూ “తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్” అభివృద్ధి చేయాలి.

పై తెలంగాణ సప్త సంకల్పాలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, మండల పరిధిలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

“అమరవీరుల త్యాగం – తెలంగాణ ఆత్మగౌరవం
సెప్టెంబర్ 17 – తెలంగాణ విమోచనం”

ధన్యవాదములతో,బీజేపీ దుండిగల్ సర్కిల్ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి తురాయి భాను గౌడ్, ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు,జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, మాజీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి సీనియర్ నాయకులు సర్గారి సత్తిరెడ్డి ధమ్మగారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు