ప్రజల ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు, ప్రతి ఫిర్యాదును వారం రోజుల గడువులో పరిష్కరించాలి
ప్రజలు వారి అర్జీలు, దరఖాస్తులను తమ కార్యాలయానికి సంబందించిన 81858 85127 వాట్సాప్ నెంబర్ కు పంపవచ్చు
చెరువులు, ప్రభుత్వ భూముల అక్రమణలను ఉపేక్షించేది లేదు, ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపట్టాలి ........... రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి
మండల స్థాయిలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ఫిర్యాదులపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో అధికారులతో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం, పనిదినాలు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ అర్జీలు, దరఖాస్తులను అధికారులతో పాటు మంత్రి కార్యాలయానికి సంబందించిన 81858 85127 వాట్సాప్ నెంబర్ కు పంపవచ్చని సూచించారు.
ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లోగా పరిష్కరించాలని, కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు మినహా ఏ ఫిర్యాదును కూడా వారం రోజులకు మించి పెండింగ్‌లో ఉంచేందుకు అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత అర్జీలకు లిఖిత పూర్వకంగా బాధ్యతగా అర్జీదారుకు తెలియజేయాలన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి హెచ్చరించారు. ప్రజల పిటిషన్లను తిరస్కరించడం, నిబంధనలకు విరుద్ధంగా లేదా తప్పుడు ఆదేశాలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడే అధికారులపైనా చర్యలు తప్పవన్నారు. బదిలీ అయినప్పటికీ గతంలో చేసిన తప్పిదాలకు బాధ్యత తప్పదని స్పష్టం చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి మండలంలో నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. అధికారులు తమ పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి ఆగ్రహం
సమీక్ష సమావేశంలో కొన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీపనగండ్లకు చెందిన బీచుపల్లి గౌడ్ తన భూమికి సంబంధించిన సర్వే సమస్యపై ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారంలో జాప్యం చేయడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.
అదేవిధంగా కల్వరాల గ్రామంలోని సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై మంత్రి స్పందిస్తూ, మొత్తం సర్వే నంబర్‌లోని భూమిని సమగ్రంగా సర్వే చేయాలని ఆదేశించారు. అందులో అవసరమైన స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించి, మిగిలిన స్థలంలో ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
చెరువులు, ప్రభుత్వ భూముల అక్రమణలపై కఠినంగా వ్యవహారించాలని, అలా ఎవరు చేసినా సహించేది లేదన్నారు. ఎవరైనా అటువంటి వాటికి పాల్పడితే ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధి హామీ పనుల్లో మానవదినాల పెంపుపై దృష్టి
వీబీజీ/రామ్‌జీ పథకం కింద ఉపాధి హామీ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో కూలీల పని దినాల (Man Days) లక్ష్యాల సాధనకు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పని దినాల కల్పనలో ఉత్తమ పనితీరు కనబరిచే పంచాయతీ కార్యదర్శులకు ప్రోత్సాహకంగా కానుక అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండల పరిధిలో కొనసాగుతున్న సింగోటం గోపాల్ దిన్నె నీటి పారుదల ప్రాజెక్ట్ కు సంబందించి త్వరగా భూసేకరణ పూర్తి చేసి అవార్డు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా విద్యుత్ శాఖపై సమీక్షిస్తూ, మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు విద్యుత్ శాఖ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు, ప్రజలకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వీపనగండ్ల మండలానికి 375 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా ఇప్పటివరకు 321 మంది లబ్ధిదారులను గుర్తించారని, ఇంకా 54 మంది లబ్ధిదారుల ఎంపిక పెండింగ్‌లో ఉందని అధికారులు మంత్రికి వివరించారు. మొదటి విడత లబ్ధిదారుల ఎంపికే ఇంకా పూర్తికాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీ సమావేశాలు నిర్వహించి, రెండు మూడు రోజుల్లోగా పెండింగ్ లో ఉన్న 54 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ఆదేశించారు.
పొరపాటుగా L3 జాబితాలో నమోదైన అర్హులైన లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు గుర్తించి సంబంధిత ఎంపీడీవోలకు వివరాలు అందించాలని మంత్రి సూచించారు. హౌసింగ్ లాగిన్‌లోని L3 to L1 Module ద్వారా అర్హులైన వారి ప్రతిపాదనలను వారం రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు పంపాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో పరిష్కరించగల అంశాలను అక్కడే పరిష్కరించాలని సూచించారు. ఆర్థిక స్తోమత కారణంగా ఇండ్లు కట్టుకోలేని వారికి బ్యాంకు రుణాలను ఇప్పించి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా మన తాలూకాలో అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి సంపత్ రావు పల్లి గ్రామంలో భూమి లేని పేదలకు పట్టాలు ఇప్పించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. అన్‌మ్యాప్డ్, అనామలీస్ కేటగిరీల కింద నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి, తమ ఓటు తుది జాబితాలో ఉండేలా చూసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాల అమలులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చేపట్టాలని సూచించారు. ఏదైనా శాఖలో ఏవైనా అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈవో యాదయ్య, స్థానిక సర్పంచ్ పార్వతమ్మ, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST