యాదవ బజార్ ప్రధాన రహదారిపై జరిగిన నిరసన – పోలీసులపై వచ్చిన ఆరోపణలపై స్పష్టీకరణ.
సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా పోలీసు పని చేసింది.. కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.
కోదాడ పట్టణంలోని 32వ వార్డు, యాదవ బజార్ టర్నింగ్ వద్ద మున్సిపాలిటీకి చెందిన స్థలంలో డబ్బా కొట్టు ఏర్పాటు చేసి పాన్ షాపు నిర్వహిస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. సదరు డబ్బా కొట్టును గడ్డం శ్రీమతి కనకమహాలక్ష్మి, భర్త శ్రీనివాస్, యాదవ కులం, బంజార కాలనీ, కోదాడ టౌన్ వారు గత సుమారు 20 సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు, అందులో పాన్ షాపును ఏర్పాటు చేసి ఓబెనబోయిన వీరయ్యకు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం ఉంది. సదరు పాన్ షాపు రహదారికి అడ్డుగా ఉండటంతో ప్రజలు మరియు వాహనాల రాకపోకలకు, ముఖ్యంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు గత కొంతకాలంగా సంబంధిత వ్యక్తులకు షాపును తొలగించుకోవాలని సూచిస్తూ వచ్చారు. రహదారికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు, షాపులను తొలగించే ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కూడా మున్సిపల్ అధికారులు సదరు డబ్బా కొట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
సాయంత్రం సుమారు 05:30 గంటలకు మున్సిపల్ అధికారులు సదరు షాపును తొలగించడానికి ప్రయత్నించగా, గడ్డం కనకమహాలక్ష్మి మరియు ఆమె బంధువులు మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వారు సంబంధిత వ్యక్తులకు షాపును తొలగించుకోవాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
తేదీ 28-08-2026 తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సదరు షాపు/డబ్బా కొట్టును తొలగించారు. సదరు షాపును తొలగించడం పూర్తిగా మున్సిపల్ అధికారుల పరిధిలో చేపట్టిన చర్య కాగా, పోలీసులకు షాపు తొలగింపుతో ఎటువంటి సంబంధం లేదు. పోలీసుల పాత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలను పరిరక్షించడం మరియు అవసరమైనప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం మాత్రమే.
యాదవ బజార్ రహదారిపై నిరసన షాపు తొలగింపు అనంతరం శ్రీమతి గడ్డం కనకమహాలక్ష్మి తన బంధువులతో పాటు శ్రీ మాదాల ఉపేందర్ యాదవ్ మరియు తదితరులతో కలిసి యాదవ బజార్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు తేదీ 28-08-2026 న ఉదయం సుమారు 09:00 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అదే రోజు రక్షాబంధన్ పండుగ కావడంతో కోదాడ పట్టణంలో ప్రజలు, వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నాయి. రహదారిపై నిరసన కారణంగా వాహనదారులు, పాదచారులు, సమీపంలోని వ్యాపారులు మరియు సాధారణ ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. అక్కడి ప్రజలు మరియు వాహనదారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి సాధారణ రాకపోకలకు అవకాశం కల్పించాలని పోలీసులను పలుమార్లు కోరారు.
ప్రజలకు మరింత అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను మసీదు కాంప్లెక్స్ మరియు రంగా థియేటర్ వైపు మళ్లించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. అదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన వారికి పోలీసులు పలుమార్లు శాంతియుతంగా రహదారి ఖాళీ చేసి, ప్రజల రాకపోకలకు సహకరించాలని సూచించారు. అయినప్పటికీ బైఠాయింపు కొనసాగడంతో, ప్రజల భద్రత, వాహనాల సాఫీ రాకపోకలు మరియు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
కోదాడ టౌన్ సీఐపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..
ఈ సంఘటనకు సంబంధించి కోదాడ టౌన్ సీఐ నిరసనకారులపై చేయి చేసుకున్నారని, దౌర్జన్యంగా వ్యవహరించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.
విధి నిర్వహణలో భాగంగా పోలీసులు రహదారిపై బైఠాయించిన వ్యక్తులను పలుమార్లు శాంతియుతంగా తప్పుకోవాలని, ట్రాఫిక్‌కు మరియు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని సూచించారు. నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలను పునరుద్ధరించడం మరియు శాంతిభద్రతలను పరిరక్షించడం కోసం మాత్రమే పోలీసులు జోక్యం చేసుకున్నారు.
కోదాడ టౌన్ సీఐ గానీ, ఇతర పోలీసు అధికారులు గానీ నిరసనకారులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం లేదా చేయి చేసుకోవడం జరగలేదు. పోలీసులపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు నిరాధారమైనవి.
అలాగే, డబ్బా కొట్టు తొలగింపులో పోలీసులే ప్రత్యక్షంగా పాల్గొని తొలగించారనే ప్రచారం కూడా వాస్తవం కాదు. డబ్బా కొట్టు తొలగింపు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన చర్య. పోలీసులు కేవలం శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన విధులు మాత్రమే నిర్వర్తించారు.
Cr.No.434/2026కు సంబంధించిన అంశం
ఇదిలా ఉండగా, కోదాడ పట్టణానికి చెందిన శ్రీ మాదాల ఉపేందర్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి శ్రీ పాశం శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో Cr.No.434/2026 U/s 353(1)(b), 353(1)(c), 353(2), 352, 356, 61(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీ మాదాల ఉపేందర్ యాదవ్‌కు తేదీ 27-08-2026 న నోటీసు జారీ చేసి, సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు మరియు వివరణను తేదీ 28-08-2026 న సమర్పించాలని కోరడం జరిగింది. ఇట్టి దర్యాప్తుకు సహకరించకుండా ఉండి ఈ రోజు ఆయన తన బంధువులు మరియు ఇతరులతో కలిసి యాదవ బజార్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తూ ప్రజలు మరియు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు పలుమార్లు రహదారి ఖాళీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని సూచించినప్పటికీ నిరసన కొనసాగడంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
ఈ చర్యలు ఎటువంటి రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిగత ప్రయోజనం లేదా ఇతర దురుద్దేశంతో చేపట్టినవి కావు. కేసు దర్యాప్తు ఒక అంశం కాగా, ప్రజా రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించడం మరో అంశం. ఇరువిషయాల్లోనూ పోలీసులు చట్టప్రకారం, నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
కోదాడ పట్టణ ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజల భద్రత, ప్రజా రహదారులపై సాఫీగా రాకపోకలు, శాంతిభద్రతల పరిరక్షణకు కోదాడ సబ్ డివిజన్ పోలీసులు నిరంతరం కట్టుబడి ఉన్నారు.
–R.శ్రీనివాస్ రెడ్డి డీఎస్పీ, కోదాడ సబ్ డివిజన్


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
