ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి…
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు…
–బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : తెలంగాణలో పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. కళాశాలలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల చదువులు, పరీక్షలు, ధ్రువపత్రాల జారీ, తదుపరి విద్యావకాశాలపై ప్రభావం పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న బకాయిలను పారదర్శకంగా విడుదల చేయడంతో పాటు విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సోమారపు లావణ్య డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిర్వహిస్తున్న 48 గంటల పోరాటానికి పెద్దపల్లి జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు అతీతమైన అంశమని, వారి హక్కుల సాధన కోసం బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తుందని సోమారపు లావణ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్గెల్ శ్రవణ్, కుమారస్వామి, రజిత, హనుమతు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
