విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకు తాత్కాలిక చర్యలు….
మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మల్లేపల్లి డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహించాలి….
విద్యార్థుల రాకపోకల సమస్యలకు పరిష్కారం చూపాలి….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, మంథని/
విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మల్లేపల్లి డిగ్రీ కళాశాల తరగతులను తాత్కాలికంగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. కళాశాల భవనం, తరగతి గదులు, ఖాళీగా ఉన్న మొదటి అంతస్తును పరిశీలించారు. మల్లేపల్లి డిగ్రీ కళాశాలకు దూరం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న మొదటి అంతస్తును వినియోగంలోకి తీసుకొని మల్లేపల్లి డిగ్రీ కళాశాల తరగతులను తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలి, అనంతరం పాలకుర్తి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సమీక్షించిన ఆయన, ప్రతి సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను పెండింగ్లో ఉంచకుండా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలి
రైతులు ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశాలను వివరించాలని తెలిపారు. అవసరానికి మించి యూరియాను వినియోగించకుండా రైతులకు అవగాహన కల్పించి, సమతుల్య ఎరువుల వినియోగంతో భూసారాన్ని పరిరక్షించాలని ఆదేశించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా, మురుగు కాలువలు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ ఆరిపోద్దిన్, పాలకుర్తి మండల ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈఓ నరేందర్, ఎంపీడీఓ రమేష్, తహసిల్దార్ రాజేశ్వర్ రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
