ఎమ్మెల్యే ఆదేశాలతో.. ఆటోనగర్ రోడ్డుకు మహర్దశ…
వెంటనే స్పందించిన అధికారులకు డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్ కృతజ్ఞతలు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : ప్రజా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ఆటోనగర్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడంపై రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ హర్షం వ్యక్తం చేశారు.
రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీ–ఆటోనగర్ మార్గంలో వరద నీటి మళ్లింపు కోసం రోడ్డు తవ్వడంతో గత వారం రోజులుగా ఆటోనగర్ కాలనీకి రాకపోకలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గుర్తించిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.
సమస్యపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు రహదారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగింది. తవ్విన రోడ్డు వద్ద అవసరమైన పైపులు అమర్చి, మట్టి పూడ్చి రహదారిని పునరుద్ధరించడంతో ఆటోనగర్ వైపు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు, సమస్యపై తక్షణమే స్పందించి పనులు పూర్తి చేసిన మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో పాటు సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలి
డివిజన్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ కాలనీ హనుమాన్ గుడి వెనుక 60 మీటర్ల మెయిన్ రోడ్డు నిర్మాణం, అలాగే మేడిపల్లిలో ఓపెన్ డ్రైనేజీ పనులను కూడా అధికారులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
ఆటోనగర్ రోడ్డు మరమ్మతులు పూర్తవడంతో కాలనీ వాసులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్, మున్సిపల్ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
