ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ…
పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం….
–మంత్రుల సమీక్ష…
సాక్షిత పెద్దపల్లి- హైదరాబాద్/ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణ రావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్లో ఉన్న పనులు, కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రామగుండం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావన రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అవసరాలు, పెండింగ్లో ఉన్న పనులు, భవిష్యత్లో చేపట్టాల్సిన ప్రాధాన్యతా కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సమావేశంలో వివరించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
