వేధింపులకు భయపడొద్దు.. షీ టీమ్‌కు సమాచారం ఇవ్వండి….
విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై అవగాహన
పెద్దపల్లి అమర్‌నగర్‌లో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, : విద్యార్థులు అప్రమత్తంగా ఉండటంతో పాటు, మహిళలు మరియు బాలికల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి అమర్‌నగర్‌లోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, అపరిచితుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో చట్టం, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల ప్రభావం, వాటిని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన విధానం, విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనపై వివరించారు.
అలాగే ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.
వేధింపులకు గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలి
ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే షీ టీమ్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ లావణ్య కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం షీ టీమ్ సభ్యులు ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
వేధింపులకు గురైన వారు 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం లేదా బెదిరింపు ఎదురైతే వెంటనే 112కు డయల్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ (T-Safe) యాప్‌ను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
