తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జయశంకర్.. ఆయన ఆశయాలు స్ఫూర్తిగా సేవలందిద్దాం…
–సీపీ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కొనియాడారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి సీపీ అంబర్ కిశోర్ ఝా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది కూడా పుష్పాంజలి ఘటించి తమ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలకు పైగా నిరంతరం కృషి చేసిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం, నాన్-ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం తదితర ఉద్యమాల్లో పాల్గొంటూ దేశవ్యాప్తంగా పలు వేదికలపై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించారని గుర్తు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పోలీసు శాఖ ప్రజలకు మరింత సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, పరిపాలన అధికారి (ఏఓ) శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, రమేష్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
