Rythu Bharosa : తెలంగాణ రైతులకు పండగ లాంటి వార్త.. నేడు బ్యాంకుల్లో నగదు జమ
Rythu Bharosa : తెలంగాణ అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతన్నల ఖాతాల్లోకి నగదు జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. తెలంగాణలోని సుమారు 70 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యాసంగి సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని నర్మటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన అధికారికంగా ఈ నిధులను విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది.
తొలి విడతలో ఎవరెవరికి వస్తాయి?
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. నిధులను మూడు విడతల్లో విడుదల చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,590 కోట్లు కేటాయించింది. రేపు సీఎం బటన్ నొక్కిన వెంటనే ఈ నిధులు ప్రాధాన్యతా క్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చిన ఈ సాయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెంచిన మొత్తంతో రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది.
రెండో, మూడో విడతల షెడ్యూల్ ఇదే
రైతులందరికీ ఒకేసారి కాకుండా, భూమి విస్తీర్ణం ఆధారంగా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల అవుతాయి. ఇందులో సుమారు రూ.2,650 కోట్లు జమ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత కింద ఏకంగా రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో వేయడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. దీనివల్ల పెద్ద రైతులు, కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు బంధు నుంచి రైతు భరోసాకు..
గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10,000 (రెండు విడతల్లో కలిపి) ఇచ్చేది. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలో భాగంగా ఈ మొత్తాన్ని ఏడాదికి రూ.12,000కు పెంచింది. అంటే ప్రతి సీజన్ లోనూ ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. సాగు ఖర్చులు పెరిగిన తరుణంలో ఈ అదనపు సాయం తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, రేపు మధ్యాహ్నం నుంచి రైతుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు ఎస్ఎంఎస్ రావడం మొదలవుతుంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY