క్యాన్సర్ రహిత సమాజం కోసం పాటు పడదాం
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
…
సాక్షిత : భారతదేశ మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటన్నారు కోవూరు ఎమ్మెల్యే మరియు టిటిడి పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ లోని పద్మావతి ఆడిటోరియంలో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెమినార్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైద్యం కన్నా నివారణే మిన్న అనే నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించలేక పోతున్నారని తత్ ఫలితంగా 50 శాతానికి పైగా మహిళలు వ్యాధి ముదిరి తీవ్ర స్థాయికి చేరిన దశలో గుర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాణాంతకం అయినప్పటికీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే 90 శాతానికి పైగా కేసులను చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తల వంటి క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలను సమన్వయం చేసుకొని గ్రామీణ మహిళలను చైతన్య పరచాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరారు. వైద్య రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు డిజిటల్ మమోగ్రఫీ వంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఇవి అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సర్‌ను గుర్తించగలవని ఆమె తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY