యువత భవిష్యత్తుకు డ్రగ్స్,గంజాయి మహమ్మారితో ముప్పు….
-పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి….
సాక్షిత పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంథని కేంద్రంలోని శివ కిరణ్ గార్డెన్‌లో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు.
గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, మంథని సీఐ బి. రాజు, ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు, యువత, విద్యార్థులను సమీకరించి పిల్లల భద్రత,డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలు మరియు “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి,ఎస్.పీ. నాయక్ బంజారా (ప్రవచనకర్త) హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ,డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నదని తెలిపారు.ఒక్కసారి డ్రగ్స్‌కు బానిస అయితే ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. డ్రగ్స్ సమస్య కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.
ఎవరైనా డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డీసీపీ తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.
“అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని డీసీపీ సూచించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, మితిమీరిన వేగంతో వాహనం నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,మంథని సీఐ బి.రాజు,మంథని ఎస్‌ఐ రమేష్, ఎస్‌ఐ సాగర్, మంథని మున్సిపల్ చైర్మన్ బొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY