సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ విధింపు
సిద్దిపేట జిల్లాలో జరగనున్న పదవ తరగతి (ఎస్ ఎస్ సి) వార్షిక పరీక్షల నేపథ్యంలో, పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు మరియు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, 163BNSS 2023 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS 2023) సెక్షన్ 163 ప్రకారం, జిల్లాలోని 82 పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు.
ఈ ఆంక్షలు పరీక్షలు జరిగే రోజుల్లో, అంటే మార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు, పరీక్ష జరిగే ప్రతిరోజూ ఉదయం 07:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు అమలులో ఉంటాయి. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కర్రలు, రాళ్లు, ఆయుధాలు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండటం నేరం. అలాగే, ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు సంబంధించిన నిషేధిత కాగితాలను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ ఉత్తర్వుల నుండి కింది వారికి మినహాయింపు ఉంటుంది:
- విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు.
- విధుల్లో ఉన్న సైనిక సిబ్బంది.
- విద్యాశాఖకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.
- అంత్యక్రియల ఊరేగింపులు.
విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేలా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తగిన బందోబస్తు మరియు రక్షణ ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
