కడిపికొండలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచన
వర్ధన్నపేట నియోజకవర్గం కడిపికొండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ… రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో కాజీపేట దర్గా పాక్స్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, 44వ డివిజన్ అధ్యక్షులు జక్కుల సదానందం, 45వ డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్ రెడ్డి, 46వ డివిజన్ అధ్యక్షులు వస్కుల శ్రీనివాస్, 64వ డివిజన్ అధ్యక్షులు దువ్వ శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST