ప్రియుడి కారుపై 3,400 ముద్దులు.. ఆపై ₹5,500 జరిమానా

Sakshitha news

ప్రియుడి కారుపై 3,400 ముద్దులు.. ఆపై ₹5,500 జరిమానా!

గ్వాలియర్‌: ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతి తన ప్రేమను చాటుకున్న తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారడమే కాకుండా, ప్రియుడికి ట్రాఫిక్‌ పోలీసుల నుంచి గట్టి జరిమానాను మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన ఓ యువతి తన ప్రియుడు ఆదిత్యకు చెందిన కారుపై లిప్‌స్టిక్‌తో ఏకంగా 3,400 ముద్దుల ముద్రలు (Kiss Marks) వేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, కేవలం 24 గంటల్లోనే 55 లక్షలకు పైగా వీక్షణలు దక్కించుకుని విపరీతంగా వైరల్‌ అయింది.
రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు
ఈ వీడియో ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో, కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఆదిత్యను గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. మోటారు వాహనాల చట్టం (MV Act) నిబంధనలను ఉల్లంఘించి వాహన రూపురేఖలను మార్చినందుకు గాను అతనికి ₹5,500 జరిమానా విధించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే అతని చేత కారుపై ఉన్న లిప్‌స్టిక్‌ గుర్తులన్నింటినీ పూర్తిగా తుడిపించి శుభ్రం చేయించారు. వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు

Scroll to Top