సింగరేణి భవిష్యత్‌కు బలమైన చర్యలు చేపట్టాలి.

Sakshitha news

సింగరేణి భవిష్యత్‌కు బలమైన చర్యలు చేపట్టాలి….

నూతన బొగ్గు గనులు ప్రారంభించాలి..బకాయిలు వెంటనే చెల్లించాలి….

— డా.బి.జనక్ ప్రసాద్….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : సింగరేణి సంస్థ అభ్యున్నతి, కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఇటుక్ ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి డా. బి. జనక్ ప్రసాద్ కోరారు.

సింగరేణి గుర్తింపు పొందిన ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీతో పాటు అధికారుల సంఘం నాయకులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన బొగ్గు గనులను ప్రారంభించాలని, ప్రభుత్వం, విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హోదా కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన వేతన అదనపు ప్రయోజనాలపై ఆదాయపు పన్ను మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన వంటి కీలక సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారులకు సంబంధించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక వేతనం తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

కార్మికులు, అధికారుల సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యంతో చర్చించి సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్ తదితరులతో పాటు ఏఐటీయూసీ, అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top