బాధ్యతాభావంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు – 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష…
ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయమే మార్గం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ప్రతి వారం ఒక్కో శాఖకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందన్నారు.
ప్రజల నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, అందుకే జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మరింత మెరుగైన కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లు, పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ప్రతి అధికారి “ఇది నా బాధ్యత” అనే భావనతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు.
కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తూ పనులను ఒత్తిడిగా కాకుండా సేవాభావంతో, ఆసక్తితో నిర్వహిస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా భావించి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
