సూర్యాపేటలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం-పరిశుభ్రతకు ప్రాధాన్యం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పట్టణాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రారంభించారు. ఈ ప్రణాళికలో భాగంగా మార్చి 15వ తేదీ వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి కార్యాచరణలో తొలి థీమ్‌గా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి పరిశుభ్రత ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అధికారులు తమ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఆలస్యం చేయకుండా వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి చివరి నెల కావడంతో మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరగా పరిష్కరించడంతో పాటు పారిశుధ్య పనులను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఈఈ కిరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
