సరైన అవగాహనతోనే విపత్తులపై విజయం
- ఈ నెల 28వ తేదీ వరకు ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్-2026
- కార్యక్రమాల సత్ఫలితాలపై సమన్వయ శాఖలు దృష్టిపెట్టండి
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
….
సాక్షిత : విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని.. ఈ క్రమంలో సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్(ఫామెక్స్)-2026 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్-2026పై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ శాఖల జిల్లాస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండపావులూరు ఎన్‌డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు. 3,31,618 హెక్టార్ల జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో వరదలు వంటి విపత్తులు సంభవించేందుకు అవకాశమున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో సన్నద్ధత చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక (డీడీఎంపీ)తో పాటు రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, వ్యవసాయం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు, ఎన్‌డీఆర్ఎఫ్ భాగస్వామ్యాన్ని వివరించేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫామెక్స్ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడంలో కీలక భాగస్వాములు కావాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, వివిధ పరిశ్రమలతో పాటు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్), ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ తదితర వాలంటీర్లతో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో సామాజిక అవగాహన-సన్నద్ధతా కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ప్రజల్లో భద్రతా చైతన్యం లక్ష్యం: భూపేంద్ర కుమార్
20 సభ్యుల ఎన్‌డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ఫామెక్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెరుగుతుందని.. తద్వారా విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించగలమని ఎన్‌డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర కుమార్ అన్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సామర్థ్య నిర్మాణంతో పాటు ప్రాథమిక చికిత్స, నేలకొరిగిన నిర్మాణాల్లో సెర్చ్, రసాయన, జీవ విపత్తులకు సంబంధించిన స్పందన, అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, భూకంపాలు వంటివాటిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమాజంలో విపత్తులపై ముందస్తు సన్నద్ధతను పెంపొందించడం, ప్రమాద సమయంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా సమర్థంగా వ్యవహరించేలా చైతన్యం కల్పించడం అని భూపేంద్రకుమార్ వివరించారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, ఎన్‌డీఆర్ఎఫ్ బృంద సభ్యులు కె.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్‌కేజీ వెంకట్, ఐ.హరికృష్ణ, విజయవాడ ఆర్‌డీవో టి.వి.సతీష్, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY