గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి దిశగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. మూడో విడతగా సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్), మునగాల, చివ్వేంల, పెన్పహాడ్ మండలాలకు చెందిన సర్పంచులకు శిక్షణ ఇస్తున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీ పనుల సమర్థవంతమైన నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సర్పంచ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, డిజిటల్ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా సౌకర్యాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవలందింపులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి తదితర అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
