భారీస్థాయిలో ఆర్గానిక్ రైతోత్సవం
- అన్నదాతలు, ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోండి
- కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషిచేద్దాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఈ నెల 21వ తేదీ శనివారం ఎ.కొండూరు మండలం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లా సేంద్రియ మేళా-ఆర్గానిక్ రైతోత్సవం జరగనుందని.. అన్నదాతలు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
ఈ నెల 21న కృష్ణారావుపాలెం, 22వ తేదీన విజయవాడలో ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం జరగనున్న నేపథ్యంలో వీటికి చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ .. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి రెవెన్యూ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక తదితర సమన్వయ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సామర్థ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ స్టాళ్లు కూడా ఉంటాయని, సేంద్రియ సాగుకు అవసరమైన ఉత్పాదితాల ప్రదర్శన ఉంటుందన్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమథనానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇదేవిధంగా ప్రకృతి వ్యవసాయ రైతులు, వినియోగదారులు, సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోనూ ప్రకృతి వ్యవసాయ మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా మార్కెటింగ్ లింకేజీలు ఏర్పాటు చేయడంతో పాటు ఎంవోయూలపై అవగాహనతో పాటు అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి, మంచి ఫలితాలు వచ్చేలా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY