విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదు.
జిల్లా కలెక్టర్ బి సంతోష్.
జోగులాంబ గద్వాల జిల్లా సాక్షిత : భూభారతి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలి.
భూభారతి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ ఆర్డివో స్థాయిలోనే 1370 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు కూడా తమ పరిధిలోని భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను కూడా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
ల్యాండ్స్ సర్వే విషయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా లైసెన్స్ సర్వేయర్ల సహకారం కూడా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. భూ నిర్వాసితుల పునరావాస కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను కూడా సంబంధిత శాఖల అధికారుల సహకారంతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలి అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఐ ఆర్ మ్యాపింగ్ లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత సూపర్వైజర్స్, బిఎల్ వోల కు రెవిన్యూ అధికారులు సహకరించాలన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను తహసిల్దారులు తరచూ సందర్శిస్తూ తనిఖీలు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, సర్వే ఏడి నూకరాజు, ఆయా మండలాల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY