ఓటు… నోటుకు బందీ…!
అంబేద్కర్ ఆశయాలకు తూట్లు…
ప్రజాస్వామ్యం ఖూనీ….!
సమత సైనిక్ దళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ దుర్గం నగేష్ ఆవేదన…
సాక్షిత పెద్దపల్లి :
దేశ గమనాన్ని మార్చాల్సిన అత్యున్నత ఆయుధం ‘ఓటు’ నేడు విక్రయ వస్తువుగా మారిపోవడం సమాజానికి గొడ్డలి పెట్టు అని సమత సైనిక్ దళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సమత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దుర్గం నగేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
డా, బాబాసాహెబ్ అంబేద్కర్ సామాన్యుడికి అందించిన ఓటు హక్కు నేడు నోటుకు బందీ కావడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.
విలువల్లేని ఎన్నికలు.. వేలం పాటల్లో పదవులు…!
నేటి రాజకీయాల్లో ప్రజాస్వామ్య పండుగ కాస్తా “వ్యాపార సంత”గా మారిపోయిందని దుర్గం నగేష్ మండిపడ్డారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తుంటే, ఓటర్లు సైతం ఏ పదవికి ఎంత ధర అని బహిరంగంగా చర్చించుకోవడం ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక అనధికారిక ‘ప్రైస్ లిస్ట్’ నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రచారంలో ఉన్న అంచనా ధరలు..
వార్డు మెంబర్: రూ. 2 లక్షలు, సర్పంచ్: రూ. 15 లక్షలు, ఎంపీటీసీ: రూ. 10 లక్షలు
కార్పొరేటర్ 20 లక్షలు, మేయర్ 3 కోట్లు
ఎమ్మెల్యే: రూ.20 కోట్లు, ముఖ్యమంత్రి పదవి రూ. 1000 కోట్లు.
ప్రశ్నించే హక్కును తాకట్టు పెడుతున్న ఓటరు…!
”డబ్బులిచ్చి గెలిచిన నాయకుడు ప్రజా సేవ చేస్తాడని ఆశించడం అత్యాశే అవుతుంది, అని డాక్టర్ నగేష్ స్పష్టం చేశారు. నాయకులు పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు అటకెక్కుతున్నాయని దుయ్యబట్టారు.
వెయ్యి రూపాయలకో, బిర్యానీకో కక్కుర్తి పడి ఓటును అమ్ముకుంటే, ఐదేళ్ల పాటు నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతామని ఆయన హెచ్చరించారు.
”ఓటు విలువ నోటుతో కొలవలేనంత గొప్పది. ఆ విలువను గుర్తించిన రోజే బాబాసాహెబ్ ఆశించిన నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ ‘నోటు’ సంస్కృతిని ఓటరే తరిమికొట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్పు ఓటరుతోనే సాధ్యం..
రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం నాయకులను విమర్శిస్తే సరిపోదని, ఓటరు ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కరోజు ప్రలోభాలకు లోబడి ఐదేళ్ల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, విజ్ఞతతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డాక్టర్ దుర్గం నగేష్ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY