రక్త సంబంధం కాదు… వృత్తి బంధం! గాయపడిన జాఫర్‌కు మెకానికుల సాయం రూ.35 వేలు మానవీయ చేయూత…
సాక్షిత పెద్దపల్లి// రామగుండం కార్పొరేషన్ లోని గోదావరిఖనిలో మానవత్వానికి మరో చిరస్మరణీయ ఉదాహరణగా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిలిచారు. జనవరి 15న. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘం ఉపాధ్యక్షుడు ఎండి జాఫర్ కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచారు.
ఈ సందర్భంగా శుక్రవారం జాఫర్ నివాసానికి వెళ్లిన తోటి మెకానికులు, గొప్ప మనసుతో, మానవతా దృక్పథంతో రూపాయలు 30, 000 నగదుతో పాటు 5, 000 విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. చికిత్స ఖర్చులు, కుటుంబ పోషణకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, జాఫర్ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు.
కష్టకాలంలో తోడుగా నిలవడమే నిజమైన స్నేహమని, సంఘీభావం అంటే ఏమిటో ఈ సాయం మరోసారి చాటిచెప్పిందని స్థానికులు ప్రశంసించారు. ప్రమాదం జీవితాన్ని కుదిపేసినా, తోటి మెకానికుల మానవీయత జాఫర్ కుటుంబానికి కొత్త ఆశను నింపింది. కష్టం వచ్చినప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన మెకానికుల ఐక్యతకు సెల్యూట్..!
ఈ కార్యక్రమంలో టిజిపిఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు దార మధు, యూనియన్ అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మాతంగి శివరాజ్, సంయుక్త కార్యదర్శి ఆరెపల్లి కుమారస్వామి, గౌరవ సలహాదారులు గణేష్, సత్యం, సమ్మిరెడ్డి, కోశాధికారి సంజీవరెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సభ్యులు చింతం స్వామి, భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY