సాగరమాల ద్వారా హార్బర్ల ఆధునీకరణ
** ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై “కూటమి” దృష్టి
** శాసనసభలో వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / అమరావతి: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని ఏపీ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం గ్రామంలో మినీ జెట్టి / ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంత అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల స్థితిగతులు, ముత్యాలమ్మపాలెం ప్రాజెక్ట్ పురోగతి గురించి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి సమాధానంగా వ్యవసాయ,మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి 12 కోస్తా జిల్లాల్లో కలిపి 1053.07 కి.మీ తీరప్రాంతం ఉండగా, 350 ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు గుర్తించబడ్డాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని, 2020 సంవత్సరం జులై 15 నుంచి ఫిషింగ్ హార్బర్లు మత్స్యశాఖ నుంచి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.
తొలి దశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉండగా, రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, వోడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు. పీఎంఎంఎస్.వై, సాగరమాల, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో విశాఖ హార్బర్ ఆధునీకరణ పనులు రూ.178.51 కోట్లతో కొనసాగుతు న్నాయని, కాకినాడ హార్బర్ ఆధునీకరణకు రూ.58.95 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయడానికి సీఐసీఈఎఫ్ అంగీకరించిందని వివరించారు. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో అంతర్వేది పల్లిపాలెం, గుండయపాలెంలో జెట్టీ సౌకర్యాలతో కార్యకలాపాలు సాగుతున్నాయని, భావనపాడు ఎఫ్ఎల్సీకి నది ముఖద్వారం స్థిరీకరణ కోసం అవసరమైన సాంకేతిక చర్యలను ఏపీఎంబీకి తెలియజేశామని చెప్పారు. పీఎంఎంఎస్.వై కింద రూ.126.91 కోట్లతో దొండువాక, ఉప్పలంక, భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువులో ఎఫ్ఎల్సీ ల అభివృద్ధి టెండరింగ్ దశలో ఉందన్నారు.
మచిలీపట్నం, బియ్యపుతిప్ప ఎఫ్ఎల్సీ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం ప్రాంతానికి సంబంధించి ప్రజల అభ్యర్థన మేరకు సీఐసీఈఎఫ్ ద్వారా ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనాలు నిర్వహించబడినట్లు, తుది నివేదికలు అందాల్సి ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. నివేదికలు వచ్చిన వెంటనే సాంకేతిక సాధ్యత ఆధారంగా మినీ జెట్టి / ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణంపై తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోస్తా ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని మౌలిక వసతులు దశలవారీగా అభివృద్ధి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఈ ఆధునీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాక కోస్తా ప్రాంతాల్లో మత్స్యరంగానికి కొత్త ఊపొస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY