మున్సిపాలిటీ ఫలితాల్లో అధికార పార్టీ హవా..
ఇరకాటంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం
గెలుపు ఉత్సాహం ఒకవైపు ఉంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ ఫలితాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎంపికలో కీలకమైన ఎక్స్ అఫిషియో ఓటు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది. సాంకేతికంగా వీరంతా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధిష్టానం వీరికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మేయర్, ఛైర్మన్ ఎన్నికల సమయంలో వీరందరికీ పార్టీ విప్ జారీ చేయాలని కేటీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
బీఆర్ఎస్ వ్యూహం.. ఎమ్మెల్యేల ఉక్కిరిబిక్కిరి
బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా మారనుంది. విప్ పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ బేఖాతరు చేస్తే పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్కు బలమైన చట్టపరమైన ఆధారం లభించనుంది. ఇవాళ వార్డు సభ్యుల ఫలితాలు వెలువడుతుండగా, అసలైన రాజకీయం ఫిబ్రవరి 16న జరగబోయే మేయర్, చైర్మన్ల ఎన్నికల్లో ఉండబోతోంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫిరాయింపులపై స్పీకర్‌కు గడువు విధించిన తరుణంలో బీఆర్ఎస్ విధించే విప్ ఉల్లంఘన జరిగితే ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి జోష్ నింపినా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
