ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత వాహన తనిఖీలు — రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నిరంతర వాహన తనిఖీలు చేపడుతున్నామని ట్రాఫిక్ ఆర్ఐ శ్రీ కృష్ణ తెలిపారు. ముఖ్యంగా యువకులు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం కలుగుతున్నందున జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్, వాహన పత్రాలు వెంట తీసుకెళ్లాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ మరియు ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షేక్ షరీనా బేగం, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ పర్యవేక్షణలో ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
రోడ్లపై ప్రమాదకరంగా బైక్‌లతో విన్యాసాలు చేయడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, యువతలో నియమ నిబంధనలు పాటించే అలవాటు పెంపొందించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
క్రింది ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే సంబంధిత వాహనాలపై ఈ-చలాన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు
- ట్రిపుల్ రైడింగ్
- హెల్మెట్ లేకుండా ప్రయాణం
- అతివేగంగా డ్రైవింగ్
- రోడ్డు మధ్యలో విన్యాసాలు చేయడం
రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా వాహనాలు నడపాలని ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ మరియు ఆర్ఎస్ఐ బి. లక్ష్మణరావు సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
